MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 4:45 pm Posted by : MANA TOLIVELUGU

దివ్యాంగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

ఎన్నికల హామీలు అమలు చేయాలి

దివ్యాంగుల డైరెక్టరేట్‌కు పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాలి

సోషల్ జస్టిస్ పార్టీ ధర్నాలో వక్తల డిమాండ్

మన తొలివెలుగు | తెలంగాణ బ్యూరో | అక్టోబర్ 28: 

తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు బుధవారం మలక్‌పేటలోని దివ్యాంగుల సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం ఎదుట సోషల్ జస్టిస్ పార్టీ దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

దివ్యాంగ విభాగం అధ్యక్షులు ఎం.ఎస్. యాదవ్, అధికార ప్రతినిధి సీహెచ్. వేణుగౌడ్, కార్యదర్శి ధనలక్ష్మి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమ డైరెక్టరేట్‌కు పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాలని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాల సందర్భంగా దివ్యాంగులకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ. చిరంజీవులు మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించడం బాధాకరమన్నారు. దివ్యాంగులు తమ హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. గవర్నర్ కోటాలో దివ్యాంగులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించి ఖర్చు చేయకపోవడం దారుణమని విమర్శించారు. దివ్యాంగులు చేపట్టే ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారి హక్కుల సాధన కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.

సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, రాష్ట్ర ఇన్‌చార్జి కేవీ గౌడ్, ఉపాధ్యక్షులు రాఘవేందర్ ముదిరాజ్, కార్యదర్శి ఏర్పుల బాలస్వామి, రేరా విభాగం అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బానోతు శ్రీను నాయక్ తదితరులు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ధర్నా అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డికి నాయకులు వినతిపత్రం సమర్పించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీవీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, దివ్యాంగ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్, దివ్యాంగుల రాజ్యాధికార ఫోరం అధ్యక్షులు వంశరాజు రామచంద్ర, టీవీహెచ్‌ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్, మహిళా సాధికారత అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, మరుగుజ్జుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్, ఫెడ్ కార్యదర్శి చెరుకు నాగభూషణం, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ అశోక్, సీనియర్ ఉద్యమకారులు నల్గొండ శ్రీనివాస్, తీవ్ర వైకల్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి, వికలాంగుల వాయిస్ పత్రిక అధినేత షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.